December 7, 2023

Health Tips For Women: మీ పిల్లలకు, మీ వారికి, అత్తమామలకు, ఇతర కుటుంబ సభ్యులకు కావలసిన వాటన్నింటినీ అమర్చి పెడుతూ మీ గురించి మీరు పట్టించుకోవడం మానేశారా? అయితే ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ, ముందు ముందు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కనీసం ఇప్పుడయినా మేలుకోవడం మంచిది. 50 సంవత్సరాలు దాటిన స్త్రీలు తమ ఆరోగ్యం కోసం అలవరచుకోవలసిన ఆహారపు నియమాలు ఏమిటో తెలుసుకుందాం…

నిజానికి యాభై ఏళ్లు దాటిన వారికోసం ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏమీ లేదు. కాకపోతే వయసుతోపాటు శరీరానికి విటమిన్లను గ్రహించే శక్తి తగ్గుతుంటుంది కాబట్టి తీసుకునే ఆహారంలోనే ఆయా విటమిన్లు పుష్కలంగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. 

యాభైఏళ్లు వచ్చేసరికి మహిళల్లో ఈస్ట్రోజెన్‌ అనే హార్మోన్‌ తగ్గిపోవడం వల్ల శరీరానికి క్యాల్షియంను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. శరీరంలో క్యాల్షియం తగ్గితే ఆస్టియో పొరోసిస్‌ అనే వ్యాధి వస్తుంది. కాబట్టి క్యాల్షియం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. క్యాల్షియం ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు బాగా తీసుకుంటే సరిపోతుంది.

అయితే ఇక్కడ మరో విషయం… శరీరం క్యాల్షియంను గ్రహించాలంటే విటమిన్‌ డి3తోపాటు వ్యాయామం అవసరం. విటమిన్‌ డి3 కోసం పొద్దున పూట సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వ్యాయామం చేస్తే శరీరం క్యాల్షియంను గ్రహించుకుంటుంది. లేకుంటే క్యాల్షియం ట్యాబ్లెట్లు మింగవలసి ఉంటుంది.

సాధారణంగా 50 సం. దాటినవారు కుటుంబంలోని వాళ్లందరూ ఎవరి పనుల మీద వాళ్లు బయటకు వెళ్లిపోయాక ఎక్కువ సమయం కూర్చుని ఉంటారు. అందువలన కండరాలు పటుత్వం కోల్పోయి బలహీనత వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు, మొలకలు, బాదం, నట్స్‌ లాంటి  ఆహారం తీసుకోవాలి.

యాభై దాటిన వారికే కాదు, ఎవరికైనా సరే, శరీర పోషణకు మాంస కృత్తులు చాలా అవసరం. కిలో శరీర బరువుకు 1.5 గ్రా.చొప్పున మాంసకృత్తులు తీసుకోవాలి. ఉదాహరణకు 60 కేజీల బరువున్నవారు 90 గ్రాముల ప్రోటీన్‌ తీసుకుంటే సరిపోతుంది.

మరో ముఖ్య విటమిన్‌ – విటమిన్‌ బి 12. శరీరానికి రోజుకు 2.4 మైక్రోగ్రాముల బి12 కావాలి. విటమిన్‌ బి 12, శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు, ఎర్ర రక్తకణాల వృద్ధికి, మెదడు సరిగా పనిచేయడానికి అవసరం. బి 12, పాలు,పెరుగు, చీజ్, గుడ్లు, చేపలు, చికెన్‌ మొదలైన వాటిలో లభిస్తుంది.

ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్ధాలు తగ్గిస్తే మంచిది. అధిక ఉప్పు అధిక రక్తపోటుకు, కీళ్ల నొప్పులకు దారి తీసే అవకాశం ఉంది.
50 సం దాటినవారు ఎక్కువగా మతిమరుపు వచ్చిందని అంటూ ఉంటారు. ఒక సర్వే ప్రకారం వీళ్ళు నీళ్లు తక్కువ తీసుకోవడం కూడా మతిమరుపునకు ఉన్న కారణాల్లో ఒకటని తేలింది.
చక్కగా పండ్లు, కూరలు, ఆకుకూరలు, మొలకలు, తృణధాన్యాలతో కూడిన మితాహారాన్ని తీసుకుంటూ, శరీరానికి తగినంత వ్యాయామం కల్పించడం అవసరం.  

చదవండి: Best Health Tips In Telugu: ఈ చిట్కాలతో ఆరోగ్యం, అందం కూడా! రోజూ కోడిగుడ్డు తింటే..

link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *